రామగుండం టౌన్ ప్లానింగ్ అధికారి పై ఫిర్యాదు..

తెలంగాణ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ కు ఫిర్యాదు..

న్యాయవాది సింగం జనార్దన్ గౌడ్..


నేటి కలం వార్త / పెద్దపల్లి జిల్లా : రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారి (టి.పి.ఓ) నవీన్ తీవ్ర అవినీతి అధికారి అని రామగుండం పట్టణానికి చెందిన న్యాయవాది సింగం జనార్ధన్ ఆరోపించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర టౌన్ ప్లానింగ్ డైరెక్టర్‌ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. తను ఇచ్చిన ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం, ఎన్‌టీ‌పీసీ, జ్యోతినగర్ శాలపల్లి శివారులో ఉన్న లక్ష్మీ నరసింహ గార్డెన్స్ ఏ/సి ఫంక్షన్ హాల్ యజమాని చింతలపల్లి కిషన్ రావు, మున్సిపల్ అనుమతులు లేకుండా పార్కింగ్ స్థలంపై అక్రమంగా కాంపౌండ్ వాల్ నిర్మించారని పేర్కొన్నారు. సంబంధిత ఫంక్షన్ హాల్ పై గతంలో కూడా అనేక ఫిర్యాదులు చేసినప్పటికీ, అధికారుల నుండి ఎలాంటి చర్యలు తీసుకోబడలేదని వాపోయారు. టీపీఓ నవీన్ గత కొంత కాలంగా కార్యాలయంలో అందుబాటులో ఉండకపోవడమే కాకుండా, ఫోన్‌ కాల్స్‌కు కూడా స్పందించడం లేదని, బాధితులతో కాకుండా ఫంక్షన్ హాల్ యజమానితో కుమ్మక్కై, ఫిర్యాదులను ఎలాంటి పరిశీలన లేకుండా కాలయాపన చేస్తున్నాడని ఆరోపించారు. ఈ క్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారి నవీన్‌ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అలాగే అనుమతులు లేకుండా నిర్మించిన కాంపౌండ్ వాల్ మరియు గదులను తొలగించాలని టౌన్ ప్లానింగ్‌ డైరెక్టర్ కి విజ్ఞప్తి చేశారు. 

   ఇకపోతే ఈ వ్యవహారంపై పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు లేఖను జతపరిచినట్లు ఆయన తెలిపారు. ఈ ఫిర్యాదుకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ ఐటీ శాఖ మంత్రికి, ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రతులు పంపినట్లు వెల్లడించారు.

0 కామెంట్‌లు