గ్రామపంచాయతీ ఎన్నికల ట్రెండ్ సెట్ చేస్తున్న ప్రేమ జంట

       సర్పంచ్ పోటీకి లవర్‌తో నామినేషన్..


నేటి కలం వార్త తెలంగాణ : ప్రేమించిన యువతితో సర్పంచ్‌ ఎన్నికల్లో నామినేషన్‌ వేయించి, ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నాడో యువకుడు. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.  ఈ సంఘటన సంగారెడ్డి మండలం తాళ్లపల్లిలో జరిగింది.

గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌గౌడ్‌ సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ చేయాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అయితే తాళ్లపల్లి సర్పంచ్‌ పదవి ఎస్సీ మహిళకు రిజర్వు అయ్యింది. దీంతో తన ప్రేమించిన శ్రీజతో నామినేషన్‌ వేయించాలని అనుకున్నాడు. తమ కూతురు కనిపించడం లేదంటూ శ్రీజ తల్లిదండ్రులు సంగారెడ్డి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ ఫిర్యాదు చేశాడు.

దీంతో చంద్రశేఖర్‌గౌడ్‌ శ్రీజతో సర్పంచ్‌ పదవికి నామినేషన్‌ వేయించి, తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ ప్రేమ జంటకు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ మద్దతుగా నిలిచాడు. వారితో కలిసి నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి పోలీసులు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌గౌడ్, శ్రీజ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి ధ్యేయంగా ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నామని తెలిపారు. ఇందులో ఎవరి బలవంతం లేదని తాము ఇష్ట పూర్వకంగా పెళ్లి చేసుకున్నామని చెప్పారు. అయితే తాళ్లపల్లి గ్రామపంచాయతీని ఏకగ్రీవంగా చేయడానికి చేసిన ప్రయత్నాలకు ఈ పెళ్లితో బ్రేక్‌ పడింది.

0 కామెంట్‌లు