గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం..
స్థానిక సంస్థల ఎన్నికలకు కొత్త దారులు
ప్రజాప్రతినిధుల ఆశలకు మళ్లీ చిగురులు
నేటి కలం వార్త తెలంగాణ : గత కొన్ని దశబ్దాల కాలంగా అమలులో ఉన్న ఎన్నికలలో పోటీ చేయాలంటే ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉండకూడదంటూ ఉన్న నిబంధనకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన అడ్డంకులు అధికారికంగా తొలగిపోయాయి. ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా జారీ చేసిన ఆర్డినెన్సుకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. దీంతో దశాబ్దాలుగా అమలులో ఉన్న ఈ నిబంధన రద్దై, స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తి ఉన్న వేలాది మంది అభ్యర్థులకు కొత్త అవకాశాలు లభించనున్నాయి.
1994లో ఆవిర్భవించిన నిబంధన _ అప్పటి లక్ష్యం జనాభా నియంత్రణ
1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనాభా నియంత్రణను దృష్టిలో పెట్టుకొని ఈ నిబంధనను అమలు చేసింది. అప్పట్లో ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే సర్పంచ్, వార్డ్ మెంబర్, ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధిస్తూ చట్టం ప్రవేశపెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న జనాభా వేగాన్ని తగ్గించేందుకు తీసుకున్న ఓ కీలక చర్యగా ఆ చట్టాన్ని పేర్కొన్నారు. అయితే కాలక్రమేణా గ్రామీణ జనాభాలో మార్పులు, ప్రజల్లో పెరిగిన అవగాహన, కుటుంబ నియంత్రణపై ప్రభుత్వ కార్యక్రమాలు, సామాజిక మార్పులు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని తాజాగా ఈ నిబంధనను మొత్తంగా రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అభ్యర్థుల సందేహాలకు పూర్తి పరిష్కారం – పోటీలోకి ఎవరికైనా అవకాశం
గవర్నర్ ఆమోదంతో ఆర్డినెన్స్ అమల్లోకి రావడంతో ఇద్దరు పిల్లల నిబంధన ఇకపై ఎన్నికల అర్హతకు ముసుగుకాదు. దీంతో ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయవచ్చు
* సర్పంచ్, వార్డు సభ్యుడు, ఎంపీటీసీ, జడ్‌పీటీసీ స్థానాలకు అర్హత
* గతంలో నిబంధన కారణంగా పోటీ చేయలేకపోయిన అభ్యర్థులకు మళ్లీ అవకాశం
* గ్రామీణ రాజకీయాల్లో కొత్త తరహా పోటీ కనిపించే అవకాశం
ప్రభుత్వ ఈ నిర్ణయం వెలువడిన వెంటనే అభ్యర్థులు, గ్రామ నాయకులు, రాజకీయ వర్గాల్లో భారీ చర్చ జరుగుతోంది. చాలా మంది ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుండగా, కొందరు పాత నిబంధనలో ఉన్న ఉద్దేశాలను కూడా గుర్తు చేస్తున్నారు.
ప్రభుత్వం తాజా నిర్ణయం – ప్రజాస్వామ్యంలో అర్హతలకు మరింత విస్తృతం
స్థానిక పాలనలో పాల్గొనాలనే ఆసక్తిని జనాభా నిబంధనలతో పరిమితం చేయకూడదనే భావనతో ప్రభుత్వం ముందడుగు వేసిందని అధికార వర్గాలు సూచిస్తున్నాయి. గ్రామీణ అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారంలో సామర్థ్యం, సేవాభావం వంటి అంశాలు ముఖ్యమని, కుటుంబ పరిమాణం ఆధారంగా ప్రజాస్వామ్య హక్కును నిరాకరించలేమని ప్రభుత్వం భావించినట్లు సమాచారం.
గ్రామీణ రాజకీయాల్లో నూతన వాతావరణం
ఈ నిర్ణయం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలక ప్రభావం చూపనుంది. ఎన్నో మండలాల్లో, గ్రామాల్లో పోటీ చేయాలనుకునే నాయకులు ఇక ఎలాంటి అడ్డంకులు లేకుండా తమ నామినేషన్లు వేశారు. పాత నిబంధన కారణంగా రాజకీయాల్లో పాల్గొనలేకపోయిన అనేక మంది ఇప్పుడు తిరిగి రంగంలోకి రావడానికి సిద్ధమవుతున్నారు.
గ్రామాల్లో సమీకరణలు, పార్టీల వ్యూహాలు, అభ్యర్థుల ఎంపికలో ఈ నిర్ణయం ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందనే అంచనాలు ఉన్నాయి.

0 కామెంట్‌లు