15 కిలోల బంగారు నగలు మాయం..
మేనేజర్'తో సహా బ్యాంకు ఉద్యోగులే నిందితులు
నేటి కలం వార్త / రామగుండం కమిషనరేట్ : చెన్నూరు ఎస్.బీ.ఐ బ్రాంచ్ 2 - (టూ)లో జరిగిన బంగారం చోరీ కేసును పోలీసులు చేదించారు. వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఎస్బిఐ-2 (టు) బ్రాంచ్లో బ్యాంక్ మేనేజర్ తో సహా బ్యాంకు క్యాషియర్ మిగతా సహ ఉద్యోగులు అందరి సహాయ సహకారాలతో బ్యాంకు లాకర్ లో ఉన్నటువంటి సుమారు 15 కిలోల బంగారు ఆభరణాలను ఎంతో చాకచక్యంగా తీసి బయట ఉన్నటువంటి ఇతరత్రా ప్రైవేట్ బంగారు ఆభరణాల లోన్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టినారు. ఇందులో ప్రధాన నిందితుడైన బ్యాంక్ క్యాషియర్ నెరిగే.రవీందర్ సహా 44 మందిని అరెస్టు చేశారు. నిందితులలో బ్యాంక్ మేనేజర్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయ్ తో పాటు పలువురు ప్రైవేట్ గోల్డ్ లోన్ కంపెనీ ఉద్యోగులు ఉన్నారు. ఈ మేరకు ఆదివారం నాడు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ముగ్గురు ప్రధాన నిందితులను మీడియా ముందు హాజరు పరిచారు. నిందితుల నుండి 15 కిలోల పై చిలుకు బంగారు ఆభరణాలు, ఒక లక్ష 61 వేల 730 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝూ ఐ.పీ.ఎస్ తెలిపారు.
ఆన్లైన్ బెట్టింగ్ కు అలవాటు పడిన ప్రధాన నిందితుడు రవీందర్ తాను పని చేస్తున్న ఎస్.బీ.ఐ లోని 402 గోల్డ్ లోన్ ఖాతాలకు చెందిన 21 కిలోల బంగారు ఆభరణాలను దొంగిలించి ప్రైవేటు గోల్డ్ లోన్ కంపెనీలలో తాకట్టు పెట్టినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ ఆభరణాలపై వచ్చిన సొమ్మును రవీందర్ సంబంధికులకు చెందిన 60 కి పైగా అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసి, తన బెట్టింగ్ కోసం వినియోగించుకుంటున్నట్లు చెప్పారు. దీంతో పాటు కొన్ని ఫేక్ లోన్ అకౌంట్లను కూడా క్రియేట్ చేసి ఒక కోటి 58 లక్షల రూపాయలను బ్యాంకు నుండి కాజేసినట్లు ఆయన తెలిపారు. నిందితుల నుండి పూర్తి స్థాయి రికవరీ కోసం ప్రయత్నం చేస్తున్నామని బాధితులందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా భరోసా ఇచ్చారు. ఈ కేసును తక్కువ కాలంలోనే చాకచక్యంగా ఛేదించిన మంచిర్యాల డిసిపి ఏ. భాస్కర్, జైపూర్ ఏసిపి ఏ. వెంకటేశ్వర్, ఇన్స్ పెక్టర్లు దేవేందర్ రావు, బన్సీలాల్ ,డి. వేను చందర్ ఏ. ఆశోక్ , కె.నరేష్ కుమార్, బాబురావు, ఎస్సై లు పి. సుబ్బారావు, శ్రీధర్, రాజేందర్, శ్వేత, సంతోష్, లక్ష్మీ ప్రసన్న, కోటేశ్వర్, ఉపేందర్ రావు, చంద్రశేఖర్, రవి, లను హెడ్ కానిస్టేబుళ్ళు శంకర్, రవి, కానిస్టేబుల్లు రమేష్, ప్రతాప్, తిరుపతి, లింగమూర్తి తదితరులను పోలీస్ కమిషనర్ అభినందించారు.
0 కామెంట్‌లు